: టీచర్ కాదు ఆమె రాక్షసి!


పసిగుడ్డుపై ఓ టీచర్ ప్రతాపం చూపించింది. చిన్నపిల్లాడు మారాం చేస్తున్నాడని గ్రహించకుండా గొడ్డును బాదినట్టు బాదింది. సీసీటీవీ ఫుటేజిలో ఆ ఘటన రికార్డు కావడం, మీడియా దానిని ప్రసారం చేయడంతో దేశవ్యాప్తంగా వివాదం చెలరేగి ట్యూషన్ టీచర్ ను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా నగరంలో కూడా 'కాకినాడ అంథ పాఠశాల' తరహా సంఘటన చోటుచేసుకుంది. నిండా మూడున్నరేళ్లు కూడా లేని పిల్లాడిని ఇంట్లో ట్యూషన్ కు పెట్టుకున్న పూజా సింగ్ అనే మహిళ చేత్తోనే చితకబాదేసింది. గది లోపలవైపు గడియ పెట్టుకుని మరీ పిల్లాడిని చితక్కొట్టేసింది. తన మాట వినట్లేదన్న కోపంతో పిల్లాడిని ఏకంగా తిరగేసి పట్టుకుని, మంచం మీదకు విసిరేసింది. పిల్లాడు వద్దు వద్దని బతిమాలుతున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. పిల్లాడు గుక్కపట్టి గట్టిగా ఏడుస్తుండటంతో అనుమానం వచ్చిన తల్లి వెంటనే ఆ గదిలో ఉన్న సీసీటీవీ కెమెరా ఆన్ చేసి, చూడగా దారుణం వెలుగు చూసింది. వెంటనే ఆమె తలుపులు గట్టిగా కొట్టి, పూజా సింగ్ ను గట్టిగా నిలదీయగా, ఆమె పోలీసులకు మాత్రం చెప్పొద్దని బతిమాలింది. విధుల నుంచి వచ్చిన భర్తకు విషయం చెప్పగా ఆమెను నిలదీశాడు. దీంతో ఆమె ఎదురు తిరిగి, పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ అంతు చూస్తానంటూ బెదిరించింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీపుటేజీ చూసిన పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేసేందుకు వెళ్లగా పూజాసింగ్ పరారైంది. దీంతో ఆమె కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు.

  • Loading...

More Telugu News