: మంచి ఉద్యోగం అంటే... ‘గూగులే’నంటున్న యువతరం
చదువు పూర్తయిన తర్వాత సాధారణంగా ఉద్యోగం కోసం ప్రయత్నించడం పరిపాటి. అయితే, మంచి ఉద్యోగం ఏది? అని యువతరాన్ని అడిగితే... గూగులేనని సమాధానం వస్తోంది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉపాధి పొందేందుకు ఏయే సంస్థలు అనువుగా ఉన్నాయనే అంశంపై అంతర్జాతీయ బ్రాండింగ్ సంస్థ యూనివర్సమ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2014 ఆసియా-పసిఫిక్ దేశాల్లో జరిపిన ఈ సర్వేలో అంతర్జాతీయ దిగ్గజం గూగుల్ అగ్రస్థానంలో నిలవగా, భారత్ కు చెందిన ఒక్క సంస్థ కూడా తర్వాతి స్థానంలో లేకపోవడం గమనార్హం. బిజినెస్, టెక్నికల్ కోర్సులు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు సైతం తమ ఓటు గూగుల్ కేనని కుండ బద్దలు కొట్టారు. ఐటీ గ్రాడ్యుయేట్లు గూగుల్ తర్వాత యూపిల్, మైక్రోసాఫ్ట్, శామ్ సంగ్, బీఎండబ్ల్యు సంస్థలను ఎన్నుకున్నారు. నోకియా 32వ స్థానంతో నిలిచింది. బిజినెస్ కోర్సులు పూర్తి చేసిన వారు గూగుల్ తర్వాత డెలాయిట్, సిటీ, యాపిల్, పీ అండ్ జీ సంస్థలను ఎన్నుకొన్నారు. ఆ తర్వాతి జాబితాలో కేపీఎంజీ, పీడబ్ల్యూసీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ సంస్థలైన యునీలీవర్ 14వ స్థానంలో ఉండగా, నెస్లే 16, లోరెల్ 20వ ర్యాంకు దక్కించుకున్నాయి.