: 30 ఏళ్లు పరిపాలించడమే నా లక్ష్యం: జగన్
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలన దినదిన గండంగా సాగుతోందని వైకాపా అధినేత జగన్ అన్నారు. రుణమాఫీపై రోజుకో ప్రకటన చేస్తున్న చంద్రబాబు నిజస్వరూపం బయటపడుతోందని చెప్పారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీని ప్రజలు ఎక్కువ రోజులు నమ్మరని... ఐదేళ్ల తర్వాత బుద్ధి చెబుతారని అన్నారు. బాబు వస్తే జాబు అన్నారని... ఇప్పుడేమో ఉన్న ఉద్యోగాలకు కూడా గ్యారంటీ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఆదర్శ రైతులను రోడ్డు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే... 30 ఏళ్లపాటు పరిపాలన సాగించాలనేదే తన లక్ష్యమని జగన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రతి ఇంట్లో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో పక్కన తన ఫొటో ఉండాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. గుంటూరు జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న ఆయన... కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.