: ఏడు కొండలపై కొలువైన... ‘బంగారు కొండ’
ఏడు కొండలపై కొలువైన తిరుమలేశుడు నిజంగా ‘బంగారు కొండే’. శ్రీవారికి నిత్యం భక్తులు నగదుతో పాటు బంగారాన్ని సమర్పిస్తూనే ఉన్నారు. అయితే, స్వామివారికి ఉన్న బంగారానికి లెక్కే లేదు. 2009లో శ్రీ వేంకటేశ్వరస్వామి బంగారం లెక్కలపై కాంగ్రెస్ నేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, శ్రీనివాసుడి ఆస్తులపై అప్పటి పాలక మండలి సరైన లెక్కలను చూపించలేకపోయింది. శ్రీవారికి నిత్యం అలంకారానికి బంగారు ఆభరణాలను వినియోగిస్తున్నారు. వినియోగంలో లేని బంగారు నగలను టీటీడీ బ్యాంకుల్లో భద్రపరుస్తోంది. అందుకోసం స్టేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంకుతో పాటు మరికొన్ని బ్యాంకుల్లో ఖాతాలను తెరిచింది. ఐదేళ్ల కాలానికి వంద కిలోల బంగారానికి వడ్డీ రూపేణా కిలో బంగారాన్ని ఇవ్వాలన్న షరతుపై బ్యాంకుల్లో టీటీడీ బంగారాన్ని భద్రపరిచింది. ఏడుకొండలవాడికి ఉన్న 5 వేల కిలోల బంగారానికి... అలా వడ్డీగా 50 కిలోల బంగారాన్ని బ్యాంకులు జమ చేస్తున్నాయి. అలా, ఇప్పటి వరకు స్వామివారి బంగారం మొత్తం 6,800 కిలోలకు చేరిందని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ బంగారం విలువ 2010 నాటికి 60 వేల కోట్ల రూపాయలు కాగా... అనంతరం భక్తులు సమర్పించిన బంగారంతో కలిపి ఆ విలువ ప్రస్తుతం 72 వేల కోట్ల రూపాయల పైమాటే. భక్తులు ప్రతిరోజూ సమర్పించే బంగారాన్ని ప్రతి శనివారం టీటీడీ స్టేట్ బ్యాంకులో జమ చేస్తోంది. అలా శ్రీవారికి ఆస్తుల చిట్టా రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. అందుకే కలియుగ దైవమైన శ్రీనివాసుడు... వేంకటేశ్వరుడు... తిరుమల గిరీశుడు... నిజంగా ‘బంగారు కొండ’.