: బాబును కలిసిన ఎంపీపై ఫేస్ బుక్ లో అసభ్యకర సందేశాలు... వైఎస్సార్సీపీ పనేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని వైఎస్సార్సీపీ నేత, అరకు ఎంపీ కొత్తపల్లి గీత కలిసిన తరువాత విపరీత పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాబును కలిసిన అనంతరం తనకు మానసిక వేధింపులు ఆరంభమయ్యాయని గీత అరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరకులో ఆమె ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని అరకు సమస్యలపై కలిసిన అనంతరం తనకు ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. తాను కాక మరెవరైనా ఫోన్ అటెండ్ చేస్తే కనుక మౌనమే సమాధానం అవుతోందని, అలాగే తన ఫేస్ బుక్ అకౌంట్ లో అసభ్యకరమైన సందేశాలు పోస్టు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు. అయితే, ఎంపీపై ఈ రకమైన మానసిక దాడి చేయాల్సిన అసవరం ఎవరికి ఉంటుందంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ నుంచి ఎవరైనా బయటకు వస్తే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ రకమైన దాడిని నేతలే చేయిస్తున్నారా? లేక వైఎస్సార్సీపీ అభిమానులు చేస్తున్నారా? లేదా ఇంకెవరైనా ఆకతాయిలు ఈ పనికి పూనుకున్నారా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.