: ధావన్ అవసరమా..? గంభీర్ ఉన్నాడుగా: గంగూలీ
ఎంతలో ఎంత మార్పు..! లార్డ్స్ లో విజయం సాధించగానే ఆకాశానికెత్తిన వాళ్ళు... సౌతాంప్టన్ టెస్టులో ఓటమి అనంతరం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ వరుసలోనే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా బాణాలు ఎక్కుపెట్టాడు. శిఖర్ ధావన్ ను జట్టులో కొనసాగించడం అర్ధరహితమని అభిప్రాయపడ్డాడు. ధావన్ ఫామ్ లో లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నాడు. పరుగులు సాధించలేక ఇబ్బందులు పడుతున్న ధావన్ ను తప్పించి, అనుభవజ్ఞుడు గంభీర్ ను జట్టులోకి తేవాలని సూచించాడు. ఇక, పార్ట్ టైం స్పిన్నర్ మొయిన్ అలీకి టీమిండియా దాసోహం అవడాన్ని దాదా విమర్శించాడు. అందునా విదేశీగడ్డపై ఓ స్పిన్నర్ కు ఆరు వికెట్లు సమర్పించుకోవడం నిరాశ కలిగించిందని పేర్కొన్నాడు. సౌతాంప్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మొయిన్ అలీ 67 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టడం తెలిసిందే.