: ఓటమికి కారణం వాళ్ళే: ధోనీ
సౌతాంప్టన్ టెస్టులో ఓటమిని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఓటమికి బ్యాట్స్ మెన్ వైఫల్యమే కారణమని అన్నాడు. పేలవంగా అవుటయ్యారని విమర్శించాడు. జట్టులో ప్రతిభకు లోటులేదని, మానసిక దృక్పథంలోనే మార్పురావాలని ధోనీ అభిప్రాయపడ్డాడు. ఇక, గతకొంతకాలంగా నలుగుతున్న నలుగురు బౌలర్ల వ్యూహంపైనా తన అభిప్రాయం వెలిబుచ్చాడు ధోనీ. ఆ వ్యూహాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ లో నలుగురు బౌలర్లతో ఎందుకు బరిలో దిగారన్న ప్రశ్నకు బదులిస్తూ, తామెప్పుడూ ఐదో బౌలర్ ను తీసుకోలేదని తెలిపాడు. పార్ట్ టైమర్లతోనే నెట్టుకువచ్చేవాళ్ళమని చెప్పాడు. ఇక, ఈ టెస్టులో అద్భుత విజయాన్ని దక్కించుకున్న ఇంగ్లండ్ జట్టు సారథి ఆలిస్టర్ కుక్ మాట్లాడుతూ, మూడో టెస్టులో అన్ని సెషన్లలోనూ ఆధిపత్యం చెలాయించామన్నాడు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చాడు.