: వాతావరణంలోకి ఆక్సిజన్ ను విడుదల చేసే కృత్రిమ ఆకు... నాసా శాస్త్రవేత్తల్లో కొత్త ఉత్సాహం
పర్యావరణ వేత్తలకు, నాసా శాస్త్రవేత్తలకు ఒక శుభవార్త. లండన్ రాయల్ కాలేజికి చెందిన జూలియన్ మెల్ ఛియోర్రీ అనే పరిశోధకుడు సహజంగా ఉండే చెట్ల ఆకును పోలి ఉండే కృత్రిమ ఆకును తయారు చేశాడు. ఈ కృత్రిమ ఆకు కేవలం చెట్టు ఆకును పోలి ఉండడమే కాదు... ఒక చెట్టు ఆకులాగా ఇదీ వాతావరణంలో ఉండే కార్బన్ డయాక్సైడ్, నీటిని తీసుకుని ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదులుతుంది. చెట్ల ఆకులలోని కణాలలో ఉన్న క్లోరోప్లాస్ట్ లు కిరణజన్య సంయోగక్రియ ద్వారా వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ను, భూమిలోని నీటినీ తీసుకుని... ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ఇలా చెట్లు వాతావరణంలోకి ఆక్సిజన్ ను విడుదల చేయడం వల్లే... మనుషుల సహా భూమి మీద ఉన్న సమస్త జీవజాతులు బతకగలుగుతున్నాయి. ఈ సూత్రం ఆధారంగానే జూలియన్ కృత్రిమ ఆకును తయారు చేశాడు. చెట్లకు ఉండే ఆకు కణాలనుంచి క్లోరోప్లాస్ట్‌లను సేకరించి వాటిని సిల్క్ ప్రొటీన్‌లో అమర్చటం ద్వారా కృత్రిమ ఆకు సాధ్యమయిందనీ, ఇది మామూలు ఆకులాగే పనిచేస్తుందని జూలియన్ మెల్ చెబుతున్నాడు. చెట్లకు ఉండే ఆకులలాగే... కృత్రిమ ఆకుకు కొద్దిగా నీరు, కాంతి ఉంటే చాలు వాతావరణంలోకి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. కృత్రిమ ఆకు తయారీ పట్ల నాసా శాస్త్రవేత్తలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పటికే నాసా అంతరిక్షంలో మొక్కలు పెంచటం ద్వారా ఆక్సిజన్ తయారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తాజా ఆవిష్కరణ నాసా పరిశోధనలకు మరింత దోహదపడగలదనీ భావిస్తున్నారు. అంతరిక్షంలో మనుషులు నివసించేందుకు కాలనీలు ఏర్పాటు చేయాలనుకుంటున్న నాసాకు ఈ కృత్రిమ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల హెక్టార్ల అడవిని ప్రతీ రోజూ నరుకుతున్నారు. దీని వల్ల వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి... కార్బన్ డై ఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గడం... జీవజాతుల మనుగడకే ప్రమాదమని గత కొంతకాలంగా శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ఈ కృత్రిమ ఆకుతో కాంక్రీట్ జంగిల్ గా మారిపోతున్న భూమిపై ఆక్సిజన్ శాతాన్ని మళ్లీ పెంచవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.