: తగ్గిన పెట్రోల్ ధరలు... పెరిగిన డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గగా, డీజిల్ ధరలు కొంచెం పెరిగాయి. పెరిగిన ధరలను గురువారం అర్ధరాత్రి నుంచి అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ.1.41 పైసలు తగ్గగా, డీజిల్ లీటర్‌కు 62 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గడంతో పాటు, డాలర్‌తో రూపాయి విలువ పెరగడంతో... క్రూడాయిల్ దిగుమతి ధరలు తగ్గాయి. దీంతో పెట్రోల్ ధరను ఆయిల్ కంపెనీలు ఓ మోస్తరుగా తగ్గించాయి. ప్రతీ నెల 1, 16 తారీఖుల్లో అంతర్జాతీయ ముడిచమురు రేట్లు, రూపాయి మారకం విలువను అంచానా వేసుకుని... చమురు సంస్థలు పెట్రోల్ ధరలను సవరిస్తాయి. మూడున్నర నెలల్లో పెట్రోల్ ధరలు తగ్గడం ఇది రెండోసారి. అంతర్జాతీయంగా డీజిల్ ధరలు తగ్గినప్పటికీ... భారత్ లో మాత్రం కాస్త పెరగడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. డీజిల్ విషయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం జనవరి 2013లో తెచ్చిన విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా ఫాలో అవుతోంది. ఈ విధానం ప్రకారం డీజిల్ ఇంధనం అమ్మకం ద్వారా ఆయిల్ కంపెనీలకు వాటిల్లే నష్టం పూర్తిగా తొలిగిపోయే వరకూ... నెలకు లీటర్ కు 50 పైసల మేర ఆయిల్ కంపెనీలు పెంచుతాయి. నిన్నటివరకు లీటర్ డీజిల్ అమ్మకం ద్వారా ఆయిల్ కంపెనీలు రూ.1.83 మేరకు నష్టపోయేవి. తాజాగా డీజిల్ ధరను 62 పైసలు పెంచిన తర్వాత కూడా లీటర్ కు రూ.1.33 మేర నష్టపోతున్నామని చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ ప్రకారం డీజిల్ ధరను మార్కెట్ విలువకు తీసుకురావడానికి వచ్చే మూడునెలల్లో మూడుసార్లు పెంచే అవకాశం ఉంది.