: పక్కింటి ప్రియురాలి కోసం...ఇంటి ఇల్లాలిని చంపేశాడు!
పక్కింటి ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడో కామాంధుడు. ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన బిస్కెట్ కింగ్ ఓంప్రకాశ్ దాసాని కోడలి హత్యకేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... కోట్లకు పడగెత్తిన కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టిన జ్యోతి దాసాని(27) భర్త పన్నిన కుట్రలో బలైంది. భర్త పియూష్ దాసాని(30)తో కలిసి ఆదివారం రాత్రి బయటకు వెళ్లింది జ్యోతి. అలా వెళ్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు తమ వాహనాన్ని అడ్డగించారని... తనను కారులోంచి తోసేసి, జ్యోతిని కిడ్నాప్ చేశారని పోలీసులకు పియూష్ దాసాని ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు ఏ విధమైన క్లూ లభించకపోవడం, జ్యోతి భర్త మాటల్లో పొంతన లేకపోవడంతో అతనిపై నిఘా పెట్టారు. అతని సెల్ఫోన్ కాల్డేటా, ఎస్సెమ్మెస్లు, అతడు తిరిగిన ప్రదేశాల్లోని సీసీటీవీ ఫుటేజ్ వంటివన్నీ పరిశీలించారు. ఇక్కడే జ్యోతి హత్యకేసు మలుపు తిరిగింది. పియూష్ చెప్పినదంతా అబద్ధమని, భార్యను అతడే చంపేసి... ఆపై కట్టుకధలు అల్లాడని పోలీసులు నిర్ధారించారు. హత్యకు ప్రధాన సూత్రధారి పియూషేనని... తన ప్రియురాలు, డ్రైవర్ అవదేష్, అతడి స్నేహితుడు రేణు కానౌజియా సాయంతో జ్యోతిని కడతేర్చాడని పోలీసులు స్పష్టం చేశారు. ఎట్టకేలకు పియూష్ పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. పియూష్ ప్రతిరోజు అర్థరాత్రి ఒంటిగంట నుంచి 4 గంటల వరకు కనిపించేవాడు కాదు. దీంతో అతని వ్యవహార శైలిపై జ్యోతి కుటుంబంలోని పెద్దవాళ్లకు ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో అతను అకస్మాత్తుగా మాయం అవడానికి అసలు కారణం బయటపడింది. పొరుగింట్లో ఉండే మనీషా మఖీజాతో పియూష్ ఎఫైర్ చాలాకాలంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చింది. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ పియూష్పై మనీషా మఖీజా ఒత్తిడి తెచ్చింది. దీంతో అప్పటికే పెళ్లైన పియూష్ ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలంటే జ్యోతిని అడ్డుతొలగించుకోవడమే మార్గమని భావించి ఆమెను కడతేర్చాడు.