: అద్వానీ జర్నలిస్ట్...సోనియా సామాజిక కార్యకర్త... మరి మోడీ, రాహుల్?
రాజకీయ నాయకులంతా రాజకీయం వదిలేస్తే ఏం చేస్తారు... అనే చిలిపి ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా? లోక్ సభకు ఈ సందేహం వచ్చిందో ఏమో కానీ వారినే అడిగేసింది. మీరు రాజకీయ నాయకుడు కాకుండా ఉంటే ఏం చేసేవారు? అన్న ప్రశ్నకు మన రాజకీయ నాయకులు పలు రకాలుగా స్పందించారు. బీజేపీ కురువృద్ధుడు అద్వానీ-జర్నలిస్ట్, ప్రధాని నరేంద్ర మోడీ-సామాజిక కార్యకర్త, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్-టీచర్, ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ-రాజకీయ, సామాజిక కార్యకర్త, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ-వ్యూహ సలహాదారు (స్ట్రాటజీ కన్సల్టెంట్) బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్హంపూర్ ఎంపీ ఆదిర్ రాజన్ చౌదరి మాత్రం సంఘ సంస్కర్తగా పేర్కొన్నారు. ఇదే విడ్డూరం... ఎందుకంటే ఆయనపై చాలా క్రిమినల్ కేసులున్నాయి. టెస్టు క్రికెటర్ కీర్తి ఆజాద్ తాను క్రీడాకారుడినని నిజాయతీగా చెప్పుకోగా, ఎంపీ అనురాగ్ ఠాకూర్ తాను క్రికెటర్ అని చెప్పుకున్నారు. శశి ధరూర్ దౌత్యవేత్తనని పేర్కొనగా, మరో బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ మత బోధకుడినని అన్నారు. మేనకాగాంధీ రచయితనని, సౌగత్ రాయ్ విద్యావేత్తనని నిర్వచించుకున్నారు. పూనమ్ మహాజన్ బిజినెస్ పర్సన్ అని చెబితే, సుమిత్రా మహాజన్ న్యాయవాదినని తెలిపారు. ఈ వివరాలన్నీ పార్లమెంట్ వెబ్ సైట్ లో పొందుపరిచారు. 539 మంది ఎంపీలను 33 విభాగాలుగా పొందుపరిచారు. వీరిలో వ్యవసాయదారులు, బిల్డర్లు, వైద్యులు, విద్యావేత్తలు, క్రీడాకారులు, కళాకారులు, మత బోధకుడు, సామాజిక కార్యకర్తలుగా ఉండడం విశేషం.