: వివాదంలో 'సింగం రిటర్న్స్'
అజయ్ దేవగణ్ నటించిన 'సింగం రిటర్న్స్' చిక్కుల్లోపడింది. ఆ సినిమాలో హిందువులను కించపర్చే ఓ సన్నివేశం ఉందని హిందూ జనజాగృతి సమితి (హెచ్ జేఎస్) అనే సంస్థ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. ఈ సినిమాలో హిందు మతగురువులను అవమానపరిచే రీతిలో ఓ డైలాగ్ ఉందని, తద్వారా హిందువుల మనోభావాలు గాయపడతాయని ఆ సంస్థ లేఖలో పేర్కొంది. దీనిపై దర్శకుడు రోహిత్ శెట్టి మాట్లాడుతూ, తన సినిమాల్లో ఎన్నడూ వివాదాస్పద అంశాలు చొప్పించలేదని, ఇకముందూ అలాగే కొనసాగుతానని స్పష్టం చేశారు. వాళ్ళు 'సింగం రిటర్న్స్' లో ఆ సీన్ చూడకుండా మాట్లాడుతున్నారని ప్రత్యారోపణ చేశారు. తానో కమర్షియల్ ఫిలింమేకర్ నని, సినిమాకు బిజినెస్ ఎంత ముఖ్యమో తెలుసని, అలాగని వివాదాస్పద అంశాల జోలికి ఎన్నడూ వెళ్ళలేదని వివరించారు. తమ సినిమా ప్రోమో చూసి వారు అపోహ పడి ఉంటారని రోహిత్ శెట్టి అభిప్రాయపడ్డారు. ఏదేమైనా హెచ్ జేఎస్ నేతలను కలిసి ఈ విషయాన్ని చర్చిస్తానని తెలిపారు.