: మోడీ కంటే చంద్రబాబు, కేసీఆర్ మొనగాళ్లా?: షబ్బీర్ అలీ
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మండిపడ్డారు. బద్ధశత్రువైన పాక్ ప్రధానితో మన ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతుంటే... చంద్రబాబు, కేసీఆర్ లు ఎడమొహం పెడమొహంగా ఉన్నారని... వాళ్లకంటే వీళ్లు మొనగాళ్లా? అని ప్రశ్నించారు. విభజన జరిగి అరవై రోజులైనా ఇద్దరు సీఎంలు ఒక్కసారైనా కలుసుకోలేదన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో షబ్బీర్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో 1956 స్థానికతపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అటు ఎంసెట్ కౌన్సిలింగ్ పై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వివరించారు. చంద్రబాబు ఒంటెద్దు పోకడ పోకుండా ఆగస్టు 4న సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకోసం వేచి చూడాలని సూచించారు.