: బీసీసీఐ చేతిలో కీలక వీడియో సాక్ష్యం
జడేజా-ఆండర్సన్ వివాదాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారంలో జడేజాను దోషిగా చిత్రీకరించడాన్ని తప్పుబట్టిన బోర్డు ఆండర్సన్ కు వ్యతిరేకంగా కీలక వీడియో సాక్ష్యాన్ని సంపాదించింది. ఆండర్సన్... జడేజాతో దురుసుగా ప్రవర్తించిన వైనం ఈ వీడియో ఫుటేజిలో ఉన్నట్టు సమాచారం. ఈ వివాదంపై ఆగస్టు 1న విచారణ జరగనుంది. కాగా, ఐసీసీ సాధారణ విచారణ సందర్భంగా ఈ గొడవకు సంబంధించి ఎలాంటి వీడియో ఫుటేజి లేదని తొలి టెస్టుకు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన డేవిడ్ బూన్ పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ చేతికి కీలక ఆధారం లభ్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వివాదంలో దోషిగా తేలితే ఆండర్సన్ పై రెండు టెస్టుల నిషేధం విధించే అవకాశాలున్నాయి. ఇప్పటికే 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాకు గురైన జడేజా తప్పు చేసినట్టు నిరూపితమైతే అతనిపైనా రెండు టెస్టుల నిషేధం విధిస్తారు.