: బంగారం కొంటున్నారా.. ఆగండాగండి
అంతర్జాతీయ పరిణామాలతో బంగారం, వెండి ధరలు రోజురోజుకీ పడిపోతున్నాయి. ఈ పరిణామాలు కాంతాన్ని సొంతం చేసుకోవాలని ఆశ పడుతున్న సామాన్యులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మరోవైపు, ఇన్వెస్టర్లకు మాత్రం ఈ పరిణామాలు నిద్ర పట్టనీయడం లేదు. ఇంతకాలం పైపైకి వెళుతున్న బంగారాన్ని కొనలేని వారు సైతం పసిడి కొందామా అని చూస్తున్నారు. అయితే, ఇంతేనా, ఇంకా తగ్గుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి.
అయితే విశ్లేషకులు మాత్రం కొంత కాలం వేచి చూడమనే చెప్తున్నారు. బంగారం 23 వేల స్థాయి వరకూ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే విధంగా ఒక్కసారిగా మళ్లీ పెరిగిపోయే అవకాశాలు లేవని, అందుకోసం తొందరపడి కొనుగోలు చేయాల్సిన పనిలేదంటున్నారు. ఒకవేళ కొనాలనుకుంటే ఈ స్థాయిలో కొద్దిగా, ఇంతకంటే పడిపోతే మరికొద్దిగా కొనమని సూచిస్తున్నారు.
వాస్తవానికి ఆర్థిక మాంద్యం కారణంగా ఇన్నాళ్లూ అన్నిదేశాలూ బంగారాన్నే సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చూశాయి. స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో వాటిలోని నిధులు బంగారం వైపు మళ్లడంతో పసిడి మరింత ప్రియంగా మారింది. అయితే, ఆర్థిక పరిస్థితులు కొద్దిగా కుదురుకోవడం, ఈక్విటీ మార్కెట్లు మళ్లీ ఊపందుకోవడం వల్ల బంగారం లోంచి పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని అంటున్నారు. దీనికి తోడు సైప్రస్ లాంటి సంక్షోభ దేశాలు తమ వద్దనున్న బంగారాన్ని విక్రయించి బయటపడాలని చూస్తున్నట్లు వస్తున్న వార్తలు కూడా ధరలు పడిపోవడానికి కారణాలుగా చెబుతున్నారు.