: ఇంజనీరింగ్ కాలేజీలకు కౌన్సిలింగ్ కు అనుమతి ఇవ్వలేదు: తెలంగాణ విద్యాశాఖ మంత్రి
ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ తో తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకు నివేదించామని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీలకు కౌన్సిలింగ్ కు అనుమతి ఇవ్వలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తామే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. నాణ్యమైన విద్య విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని ఆయన చెప్పారు. గతంలో అక్టోబరులో కూడా తరగతులు ప్రారంభమైన సందర్భాలున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు సృష్టిస్తోన్న గందరగోళంలో ఎవరూ పడవద్దని జగదీశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫాస్ట్ అమలుపై ఉన్నతాధికారులతో కమిటీ వేసినట్లు ఆయన చెప్పారు. ఏ విద్యామండలి కూడా ప్రభుత్వాన్ని ఆదేశించలేదని ఆయన అన్నారు. చంద్రబాబు ఆంధ్రా ప్రజలను కూడా మోసం చేస్తున్నారన్నారు. ఏపీ నుంచి విద్యామండలికి ఎలాంటి అనుమతి రాలేదన్నారు. కౌన్సిలింగ్ ను పూర్తి చేయాలన్న సంకల్పం ఏపీ సర్కారుకు లేదని జగదీశ్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో సీట్లు ఇచ్చే అధికారం ఆంధ్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.