: ఆంధ్రప్రదేశ్ లో సన్మానాల సీజన్ నడుస్తోంది!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు సన్మానాల సీజన్ నడుస్తోంది. అవును, రాష్ట్ర మంత్రులు ఇప్పుడు సన్మానాలు చేయించుకోవడంలో పోటీపడుతున్నారు. భావి రాష్ట్ర రాజధానిగా చెప్పుకుంటున్న విజయవాడలో అయితే ఈ సన్మానాల హడావుడి అంతా ఇంతా కాదు. అమాత్యులు దండలేయించుకుని, దండాలు పెట్టించుకోవడంలో మునిగితేలుతున్నారు. కొందరు మంత్రులు మాత్రం తమకు సన్మానాలు అవసరం లేదని, చిన్న పుష్ఫగుచ్ఛం అందిస్తే చాలని సెలవిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉంటే... మంత్రులు మాత్రం సన్మానాలు చేయించుకోవడమేమిటని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇకనైనా మంత్రులు సన్మానాలను పక్కన బెట్టి, రాష్ట్ర భవిష్యత్ పై దృష్టి పెడితే బావుంటుందని వారు చెబుతున్నారు. మరి, మన మంత్రులు ఈ మాటలు వింటారా!