: ప్రపంచ నెంబర్ వన్ ఆల్ రౌండర్ క్రికెట్ కు గుడ్ బై


ప్రపంచ నెంబర్ వన్ ఆల్ రౌండర్, సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు జాక్వస్ కలిస్‌ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు కలిస్ ప్రకటించాడు. సఫారీ క్రికెట్ జట్టులో 'కింగ్'గా మన్ననలందుకున్న ఈ 38 ఏళ్ల క్రికెటర్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కష్టాల్లో ఉన్న ప్రతిసారి జట్టును సునాయాసంగా గట్టెక్కించి ఒంటి చేత్తో విజయాలు అందించిన కలిస్ 2013 డిసెంబరులో టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తాజాగా వన్డేల నుంచి కూడా అధికారికంగా తప్పుకుంటున్నట్టు కలిస్ స్పష్టం చేశాడు. తన కెరీర్లో 328 వన్డేలు ఆడి 17 సెంచరీలు, 86 అర్థ సెంచరీలతో 11,579 పరుగులు చేసిన కలిస్... 166 టెస్టుల్లో 45 సెంచరీలు, 58 అర్థ సెంచరీలతో మొత్తం 13,289 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో కలిస్ అనితరసాధ్యమైన గణాంకాలు నమోదు చేశాడు. కలిస్ ఆడిన 328 వన్డేల్లో 273 వికెట్లు తీయగా, 166 టెస్టుల్లో 292 వికెట్లు పడగొట్టి తనకు ఎవరూ సాటిలేరని నిరూపించాడు. అంతర్జాతీయంగా తన కెరీర్ ముగిసిందని ప్రకటించిన కలిస్, టీ20ల్లో సిడ్నీ థండర్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల సభ్యుడిగా కొనసాగాలనుందని చెప్పాడు. కాగా, కలిస్ రిటైర్మెంట్ ను దక్షిణాఫ్రికా క్రికెట్ సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లోర్గాట్ స్వాగతించారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న కలిస్ ను దక్షిణాఫ్రికా మరువదని తెలిపారు.

  • Loading...

More Telugu News