: ఏపీలో 1.17 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత: మంత్రి ప్రత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎరువుల కొరతపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈరోజు (బుధవారం) హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.17 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపారు. రైతులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి... వారికోసం నాబార్డు సాయంతో గోదాముల నిర్మాణం చేస్తామని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తామన్నారు. అంతేగాక రైతులకు మార్కెట్ యార్డుల్లో ఎక్కువ ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మార్కెట్ యార్డుల్లోనే కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు.