: నువ్వు నా పేరు సూచించు, నేను నీ పేరు సూచిస్తా..!
హర్యానాలో ఇద్దరు అధికారులు కుమ్మక్కయ్యారు! అదెలాగో చూడండి. హర్యానాలో రైట్ టు సర్వీస్ కమిషన్ పేరిట 2013లో ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. కమిషన్ అన్న తర్వాత కమిషనర్లు ఉండాలి కదా. ఇలాంటి ప్రత్యేక సంఘాలకు కమిషనర్లంటే కొన్ని అదనపు సౌకర్యాలు, హోదా లభిస్తాయి. పదవీ విరమణ అనంతరం కూడా ఇలాంటి కమిషన్లలో కొనసాగే వెసులుబాటు ఉంటుంది. అందుకే టాప్ బ్యూరోక్రాట్లందరూ ఇటువైపు వచ్చేందుకు మొగ్గుచూపుతారు. అందుకు హర్యానా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సీ.చౌధరి, అదనపు ప్రధాన కార్యదర్శి సర్బన్ సింగ్ లు మినహాయింపేమీ కాదు. తొలుత కమిషన్ సభ్యుడిగా సర్బన్ సింగ్ ను నియమించాలంటూ ప్రభుత్వానికి ఎస్.సీ.చౌధరి సూచించారు. అనంతరం సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కాస్తా.... కమిషన్ చైర్మన్ గా ఎస్.సీ.చౌధరిని నియమించాలని సర్కారుకు సిఫారసు చేసింది. వీరనుకున్నట్టే జరిగింది. సర్బన్ సింగ్ రైట్ టు సర్వీస్ కమిషన్ లో కొలువుదీరగా, ఈనెల 31న ఎస్.సీ.చౌధరి పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తారు.