: మీసం తీయలేదని మాజీ సైనికుడి చెవులు కోశారు!
తాము మీసం తీసేయమని చెప్పినా పట్టించుకోని మాజీ సైనికుడి చెవులు కోసేశారు ఇద్దరు సోదరులు. బీహార్ లో జరిగిందీ ఘటన. కౌదియా గ్రామ వాసి రామానుజ్ వర్మ మిలిటరీలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. మరో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఓరోజు విధుల నుంచి తిరిగివస్తుండగా, మార్గమధ్యంలో లాల్కూ యాదవ్, బీనా యాదవ్ అనే ఇద్దరు సోదరులు రామానుజ్ ను అటకాయించారు. మీసం తీసేయాలని హుకుం జారీచేశారు. మరోసారి మీసంతో కనిపిస్తే తామే ఆ పనిచేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే, రామానుజ్ వారి బెదిరింపులను పట్టించుకోలేదు. దీంతో, ఆ సోదరులు తమ మిత్రులను పిలిచి మాజీ సైనికుడిపై దాడికి దిగారు. బీనా యాదవ్ కత్తితో రెండు చెవులు కోసేశాడు. అనంతరం రామానుజ్ బైక్ తో సహా వారందరూ అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.