: ఎర్రచందనం స్మగ్లర్ అవతారమెత్తిన బీటెక్ స్టూడెంట్
అతడో ఇంజినీర్ అవుతాడని భావిస్తే... ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ట్రావెల్ ఏజెన్సీ నుంచి కార్లను అద్దెకు తీసుకుని, వాటితో ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేయడం ఇతడి నైజం. హైదరాబాదు యూసుఫ్ గూడలో నివాసముండే తేజ మోహన్ రాజు స్వస్థలం కడప. అతడు మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీతో జల్సాలకు అలవాటు పడ్డాడు. అయితే, తల్లిదండ్రులు ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పటి నుంచి అతని ఖర్చులకు తగిన పాకెట్ మనీ అందడం లేదు. దీంతో, అతను పక్కదారి పట్టాడు. స్నేహితులు వినాయక, ప్రసాద్ లతో కలిసి టోలిచౌకీలోని నూర్ ట్రావెల్స్ నుంచి వాహనాలను అద్దెకు తీసుకునేవాడు. అయితే, అవి చెడిపోయాయని ట్రావెల్స్ యాజమాన్యాన్ని నమ్మించేవాడు. అదే ట్రావెల్స్ నుంచి మరో వాహనం తీసుకుని, అంతకుముందు అద్దెకు తీసుకున్న వాహనాన్ని అమ్మేసేవాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఓసారి ఇలాగే అద్దెకు తీసుకున్న ఇన్నోవా వాహనం బెంగళూరులో చెడిపోయిందని, దాన్ని తీసుకొచ్చేందుకు మరో వాహనం కావాలని అడగ్గా ట్రావెల్స్ వారు స్విఫ్ట్ డిజైర్ ఇచ్చారు. అయితే, ఆ కారు తీసుకెళ్ళిన తేజ మళ్ళీ రాకపోవడంతో ట్రావెల్స్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తేజ, వినాయకను బహదూర్ పురా వద్ద ఆ రెండు వాహనాలు సహా అదుపులోకి తీసుకున్నారు. వాటిలో 60 కేజీల ఎర్రచందనం కూడా ఉంది. తాము ఎర్రచందనాన్ని కడప నుంచి కర్ణాటకలోని కోలార్ కు స్మగ్లింగ్ చేస్తుంటామని తేజ వెల్లడించాడు. నరేశ్, నయీం, జకీర్ అనే స్మగర్లు ఒక్కసారి రవాణా చేస్తే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఇచ్చేవారని తేజ తెలిపాడు.