: హర్యానాలో మరో ఐఏఎస్ అధికారిపై వేధింపులు
హర్యానాలోని భూపిందర్ సింగ్ హుడా సర్కారు తన మాట వినని ఐఏఎస్ అధికారులను వేధించడం ఇంకా మానలేదు. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణాన్ని వెలికి తీసిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను నానా ఇబ్బందులు పెట్టిన హుడా సర్కారు... తాజాగా మరో అధికారిపైనా కక్ష సాధింపు చర్యలకు దిగింది. తన ప్రభుత్వం సిఫారసు చేసిన వ్యక్తులను సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా నియమించేందుకు నిరాకరించిన ఆ రాష్ట్ర కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ కస్నీకి ఆదివారం రాత్రి బెదిరింపులు ఎదురయ్యాయి. అయితే ఈ బెదిరింపులకు దిగిన వ్యక్తి సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మరో సీనియర్ ఐఏఎస్ అధికారే కావడం గమనార్హం. అసభ్య పదజాలంతో కూడిన ఎస్ఎంఎస్ లను కస్నీకి ప్రధాన కార్యదర్శి చౌధరి పంపారు. అసభ్య పదజాలంతో పాటు బెదిరింపులకు గురిచేస్తున్న మెసేజ్ లు పలుమార్లు రావడంతో సహనం కోల్పోయిన కస్నీ, మంగళవారం మీడియా ముందుకొచ్చారు. రాజకీయ దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పించాల్సిన తన పైఅధికారే తనను వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. అయితే పైఅధిాకారిగా ఉన్న చౌధరిపై ఎలాంటి కేసు పెట్టబోనని చెప్పారు. ప్రభుత్వం సిఫారసు చేసిన వ్యక్తులకు, సమాచార హక్కు చట్టం కమిషనర్లకు ఉండాల్సిన అర్హతలు లేని కారణంగానే నిరాకరించాల్సి వచ్చిందని కస్నీ వాదిస్తున్నారు. విషయం బయటకు పొక్కడంతో చౌధరి మాట మార్చారు. తామిద్దరం ఒకే జిల్లాకు చెందిన వారమని, స్నేహపూర్వకంగానే మెసేజ్ లు పంపానని వెల్లడించారు. వాటి కారణంగా ఇబ్బంది పడి ఉంటే మన్నించాలని కస్నీని కోరారు. ఇదిలా ఉంటే, కస్నీకి ఖేమ్కా మద్దతు పలికారు. హుడా సర్కారులో ఈ తరహా ఘటనలు సాధారణమని, ఈ తరహా ప్రభుత్వ శైలితో అధికారులు నిత్యం దినదినగండంగా గడపాల్సిన దుస్థితి నెలకొనే ప్రమాదం లేకపోలేదని ఖేమ్కా తన ట్విట్టర్ పేజీలో వ్యాఖ్యానించారు.