: ఏపీలో ఇక నామినేటెడ్ పదవుల భర్తీ!
కాంగ్రెస్ పాలనలోని ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు పలు రాష్ట్ర స్థాయి సంస్థలకు కూడా పాలకవర్గాలు లేక ఏళ్లుగా సీట్లన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. రాష్ట్ర విభజన, తర్వాత రాష్ట్రపతి పాలన తదితర పరిణామాల నేపథ్యంలో ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందుగా స్థానిక సంస్థలకు ఎట్టకేలకు ఎన్నికలు జరిగాయి. అంతేకాక టీడీపీ అధికారం చేపట్టిన మరుక్షణమే స్థానిక సంస్థలకు పాలక వర్గాల ఎంపిక కూడా జరిగిపోయింది. ఇప్పుడు నూతన పాలకవర్గాలతో స్థానిక సంస్థలు కళకళలాడుతున్నాయి. జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే రాష్ట్ర స్థాయిలోనే ఆ తరహా ఉత్సాహం కనిపించడం లేదు. దీనిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రహించేసినట్లున్నారు. వెంటనే కార్యరంగంలోకి దిగిపోయారు. మంగళవారం చంద్రబాబు, ప్రభుత్వంలోని పలువురు సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన నామినేటెడ్ పదవుల భర్తీ విషయాన్ని ప్రస్తావించారు. నామినేటేడ్ పదవుల భర్తీపై ఇప్పటికే పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న మంత్రులు, చంద్రబాబే ఈ విషయాన్ని ప్రస్తావించడంతో మహదానందపడిపోయారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లతో పాటు పలు దేవాలయాలకు కూడా కొత్త పాలక వర్గాలను నియమించాల్సిందేనని ఈ సందర్భంగా చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆయా సంస్థల పాలకవర్గాలకు సంబంధించి అర్హత ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తల వివరాలను సేకరించాలని మంత్రులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారట. ఈ నేపథ్యంలో నాలుగేళ్లకు పైగా పాలకవర్గాలు లేని కార్పొరేషన్లు మళ్లీ కళకళలాడేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లేనని చెప్పొచ్చు. చంద్రబాబు నిర్ణయంతో పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం ఉరకలేస్తోంది.