: జన్యుమార్పిడి పంటలకు చెక్ పడినట్లేనా?


జన్యు మార్పిడి పంటలకు భారత్ లో నూకలు చెల్లినట్టే కనిపిస్తోంది. జన్యు మార్పిడి పంటలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశోధనలను నిలుపుదల చేయాలంటూ ఆరెస్సెస్ అనుబంధ సంఘాల విజ్ఞప్తి నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం పునరాలోచనలో పడిపోయింది. జన్యు మార్పిడి పంటల ప్రయోగాలకు సంబంధించిన విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంగళవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. అంతేకాక ఈ విషయంపై తొందరపాటుతో కూడిన నిర్ణయం ఉండదని కూడా ఆయన తేల్చిచెప్పారు. దేశంలో ప్రధాన పంట వరితో పాటు వంగ, శనగలు, ఆవాలు, పత్తి తదితర పంటలకు సంబంధించి జన్యు మార్పిడి పంటల క్షేత్రస్థాయి ప్రయోగాలకు అనుమతివ్వాలని పలు సంస్థలు కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించడానికి జెనెటిక్ ఇంజినీరింగ్ ఆమోద కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ కమిటీ పలు జన్యు మార్పిడి పంటలకు సంబంధించి క్షేతస్థాయి ప్రయోగాలకు అనుమతి ఇవ్వొచ్చని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జన్యు మార్పడి పంటలకు అనుమతి మంజూరు చేయరాదని వాదించిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థలుగా కొనసాగుతున్న స్వదేశీ జాగారణ్ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు మంగళవారం ఢిల్లీలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు జన్యు మార్పిడి పంటల పై సుదీర్ఘంగా చర్చించారు. జన్యు మార్పిడి పంటల వల్ల కలిగే నష్టాలు, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివేదిక తదితరాలను ప్రస్తావించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జన్యు మార్పిడి పంటలకు తలుపులు తెరవొద్దని వారు మంత్రిని కోరారు. దీంతో పునరాలోచనలో పడ్డ మంత్రి, దీనిపై మరింత లోతుగా పరిశీలన చేసిన మీదటే నిర్ణయం తీసుకుంటామని సదరు సంస్థల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఆరెస్సెస్ భావజాలం నిండిన బీజేపీ, దాని అనుబంధ సంస్థల మాటకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వటం సాధారణమే. ఇదే జరిగితే, జన్యు మార్పిడి పంటల ప్రయోగాలతో పాటు పంటల సాగు దాదాపుగా అటకెక్కడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News