: మేము చెప్పిందేమిటి? మీరు చేస్తోందేమిటి?: శాంసంగ్ హెచ్చరిక
తలగడకింద ఫోన్ పెట్టి నిద్రపోయే అలవాటుందా? ఛార్జింగ్ పెట్టి నిద్రపోయే అలవాటు ఉందా? అయితే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టేనని శాంసంగ్ హెచ్చరిస్తోంది. దక్షిణ టెక్సాస్ రాష్ట్రంలో ఓ బాలిక శాంసంగ్ సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి తలగడకింద పెట్టుకుని నిద్రపోయింది. ఇంతలో ఆమె ఒంటికి వేడి తగలడంతో లేచి చూస్తే...తలగడ మండిపోతూ కనిపించింది. చూస్తే సెల్ ఫోన్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు రేగినట్టు గుర్తించి మంటలను ఆర్పివేసింది. దీంతో బాలిక తండ్రి ఫోన్ లోని బ్యాటరీ కారణంగా మంటలు రేగినట్టు పోలీసులకు తెలిపారు. దీనిపై స్పందించిన శాంసంగ్ సంస్ధ తమకు వినియోగదారుల రక్షణే ప్రధమ కర్తవ్యమని పేర్కొంటూ మొబైల్ లో నకిలీ బ్యాటరీ ఉపయోగించి ఉండవచ్చన్న అనుమానం వెలిబుచ్చింది. అయినప్పటికీ శాంసంగ్ ఫోన్ కొనుగోలు చేసే ప్రతి కస్టమర్ కి యూజర్ మాన్యవల్ అందజేస్తామని తెలిపింది. మాన్యువల్ లో ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోకూడదు, మంటలు వ్యాపించే ప్రాంతాల్లో అంటే దిండ్ల కింద, దుప్పట్లకింద ఫోన్లను ఉంచి నిద్రించకూడదని సూచిస్తామని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ ఫోన్ ను ల్యాబ్ కి పంపి నాణ్యత పరీక్షలు చేస్తామని శాంసంగ్ వెల్లడించింది. వినియోగదారులు ఈ విషయాలను గుర్తించాలని శాంసంగ్ సూచించింది.