: హరీష్ రావు మరోసారి అబద్ధాలకు తెరతీశాడు: దేవినేని
తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మళ్లీ అబద్ధాలకు తెరలేపారని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ నేతలు టీడీపీపై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం మానాలని హితవుపలికారు. ఎన్నాళ్లు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడి ఏడుస్తారని ఆయన ప్రశ్నించారు. వైఎస్ ధనదాహంతో మొదలు పెట్టిన జలయజ్ఞంతో ప్రజాధనాన్ని జలగల్లా పీల్చేశారని అన్న ఆయన, ఇక ఇప్పుడు కేసీఆర్ జలయజ్ఞం మొదలైందని అంటున్నారని దేవినేని విమర్శించారు. కృష్ణా, గోదావరిపై కొత్త ప్రాజెక్టులు కట్టేస్తున్నాం అంటూ ప్రజలకు అబద్ధాలు చెబుతున్న హరీష్ రావు, కొత్త ప్రాజెక్టులు ఎలా కడతారో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రపద్రేశ్ ఒప్పుకుంటేనే ప్రాజెక్టులు కట్టేందుకు వీలవుతుందని విభజన బిల్లులో పేర్కొన్న అంశం తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడూ చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడి ఏడుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కాకుండా వాస్తవాలు మాట్లాడితే ఎవరి రంగు ఏమిటో బయటపడుతుందని ఆయన సవాలు విసిరారు. ఇప్పటికైనా తెలంగాణ నేతలు వాస్తవాలు మాట్లాడడం నేర్చుకుంటే అక్కడి ప్రజలు అభివృద్ధి చెందుతారని ఆయన సూచించారు. పక్క రాష్ట్రాలతో స్నేహం భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తుందని, శత్రుత్వం చేటు చేస్తుందని ఆయన హితవు పలికారు.