: ఆంధ్రోళ్లే బిచ్చమెత్తుకుంటారు: ఈటెల
ఆంధ్రోళ్లే బిచ్చమెత్తుకుంటారని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ లో ఆయన మాట్లాడుతూ, కలిసి ఉంటే అనుభవంతో పరిపాలిస్తామని, రాష్ట్రం విడిపోతే తెలంగాణ వారు బిక్షమెత్తుకోవాల్సి వస్తుందని కొందరు చులకనగా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. తమకు ప్రజలను ముంచే అనుభవం లేదన్న ఈటెల... అక్రమాలను చెరబట్టి, బ్రోకర్లను జైళ్లలో పెట్టే అనుభవం తమకు ఉందన్నారు. నిధులు లేక, రాజధాని లేక, పథకాలు లేక, హామీలు అమలు కాక ఆంధ్రోళ్లే బిచ్చమెత్తుకుంటారని ఆయన పేర్కొన్నారు. బీడీ కార్మికులు, గల్ఫ్ బాధితులు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. 500 కోట్ల రూపాయలతో గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు కేరళ తరహాలో ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో పర్యటించి అక్కడి వారి ఇబ్బందులు స్వయంగా తెలుసుకున్నామని తెలిపిన ఆయన, వారికి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.