: ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ తో మాకు సంబంధం లేదు: మంత్రి జగదీష్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించబోయే కౌన్సెలింగ్ తో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నిన్న (సోమవారం) జరిగిన ఉన్నత విద్యా మండలి సమావేశం పూర్తిగా ఏపీదేనని చెప్పారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి, ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఉందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందిస్తామని తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై విమర్శలు చేసిన మంత్రి, ముప్పై ఏళ్లుగా జిల్లా సమస్యలు పట్టని జానాకు కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. ఇక ఫీజు రీయింబర్స్ మెంట్ పై స్పష్టంగా ఉన్నామని, ఆగస్టు 4వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే మార్గదర్శకాల ఆధారంగా నిర్ణయించుకుంటామని పేర్కొన్నారు.