: వైఎస్ ఆత్మ కేసీఆర్ లోకి ప్రవేశించింది: తెలంగాణ టీడీపీ
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ భూమి బండారాలు బయటపెడతామని టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు... టీడీపీ అధికార ప్రతినిధి నరేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ నాయకుల చేత ఇలాంటి మాటలు మాట్లాడిస్తూ కేసీఆర్ తెలంగాణలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబుపై వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో విచారణలు చేయించినా, ఏమీ రుజువు చేయలేకపోయారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వైఎస్ ఆత్మ ఆయనలోకి ప్రవేశించిందని తమకు అర్థమవుతోందని ఆయన చురకంటించారు. చంద్రబాబుకు హైదరాబాదులో భూములు అక్రమంగా ఉన్నట్లు తేలితే టీఆర్ఎస్ నేతలకే వాటిని ఇచ్చేస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయడం మాని, ఎన్నికల హామీలపై టీఆర్ఎస్ సర్కార్ దృష్టి పెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గానికి రెండు వేల ఇళ్లకు తగ్గకుండా రూ.3 లక్షలు చొప్పున ఖర్చుపెట్టి నిర్మించి ఇవ్వాలని, ప్రజల దృష్టిని మరల్చేందుకు విచారణలతో కాలయాపన చేయవద్దని ఆయన అన్నారు.