: బీహార్ లో శివభక్తులపై నుంచి దూసుకెళ్లిన కంటెయినర్, 12 మంది మృతి
బీహార్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కగా నిద్రిస్తున్న శివ భక్తులపై నుంచి ఓ కంటెయినర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 12 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 22 మంది గాయపడ్డారు. అతి వేగంగా దూసుకొచ్చిన కంటెయినర్, అదుపు తప్పిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఔరంగాబాద్ సమీపంలో 2వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ ఉపేంద్ర కుమార్ శర్మ తెలిపారు. సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించామని క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. జార్ఖండ్ లోని దేవ్ ఘడ్ ఆలయాన్ని సందర్శించుకుని వస్తున్న శివ భక్తులు అలసట నేపథ్యంలో రోడ్డు పక్కగానే నిద్రకు ఉపక్రమించారని ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.