: సీత రావణుడి కూతురా..?
రాముని నెచ్చెలి సీత మహాసాధ్వి. రామాయణ ఇతిహాసం ద్వారా ఈ విషయాన్ని వాల్మీకి చాలా స్పష్టంగా చెప్పారు. అందుకు ఎన్నో దృష్టాంతాలు. అయితే, అంతటి పుణ్యస్త్రీ పుట్టుకపై చాలా కథనాలే ఉన్నాయి. వాటిలో సీత రావణుడి కుమార్తె అన్నది ప్రధానమైనది. క్రీస్తు పూర్వం తొమ్మిదో శతాబ్దం నాటి గుణభద్రుడి ఉత్తర పురాణాన్ని పరిశీలిస్తే సీత ప్రస్తావన వస్తుంది. అందులో ఏముందంటే... అలకాపురి అమితవేగ మహారాజు కుమార్తె మణివతి. ఓ రోజు ఆమె తపస్సు చేసుకుంటుండగా, రావణాసురుడు ఆటంకపరుస్తాడు. దీంతో, మణివతి తీవ్ర ఆగ్రహం చెంది త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేస్తుంది. ఆ తర్వాత రావణుడు, మండోదరి దంపతులకు సంతానంగా జన్మిస్తుంది మణివతి. జ్యోతిష్యులు ఆ సంతానంతో రాజుకు ప్రాణాపాయం సంభవిస్తుందని చెబుతారు. దీంతో, భయపడిపోయిన రావణుడు ఆ పాపను చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. ఈ క్రమంలో భటులు ఆమెను ఓ పెట్టెలో పెట్టి మిథిల రాజ్యం పరిసరాల్లో భూమిలో పాతేస్తారు. ఓ రైతు పొలం దున్నుతుండగా ఈ పెట్టె బయటపడడం, ఆ పెట్టెలో చిన్నారి ఉన్న విషయాన్ని రాజు జనకుడికి తెలపడం, ఆయన ఆ పసికందును సీత అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచడం తెలిసిందే. సీత అంటే నాగలి అని అర్థం. నాగలి కారణంగానే బయటి ప్రపంచాన్ని చూసిందన్న కారణంతో ఆమెకు సీత అని నామకరణం చేస్తారు. ఇక, సంగదాస రామాయణంలో అయితే, వసుదేవహింది పేరిట రావణుడి ఇంట జన్మిస్తుంది. ఇక్కడా పాత కథే. జ్యోతిష్యులు రావణుడి భార్య విద్యాధర మాయ కడుపున పుట్టే తొలి సంతానం వంశ వినాశన కారకమవుతుందని హెచ్చరిస్తారు. దీంతో, రావణుడు ఆ శిశువును రాజ్యానికి దూరంగా పాతిపెట్టాలని ఆదేశిస్తాడు. ఆ తర్వాత పొలంలో రైతు దున్నుతుండగా పెట్టె బయల్పడడం, ఆ పాపాయి జనక మహరాజు చెంతకు చేరడం ఇతర కథనాలను గుర్తుకు తెస్తుంది.