: ఆ పుస్తకాల్లో ఎన్ని తప్పులో..!
గుజరాత్ విద్యాశాఖ ఓ విషయంలో అభాసుపాలైంది. అక్కడి పాఠ్య పుస్తకాల్లో పేర్కొన్న కొన్ని విషయాలు తప్పుల తడకలుగానూ, వాస్తవదూరంగా ఉన్నాయి. వాటిలో మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే నవ్వు రాక మానదు. జపాన్ దేశం రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా అమెరికాపై అణు దాడి జరిపిందట. వాస్తవానికి అమెరికానే జపాన్ పై అణు బాంబులేసింది. ఇక, భారత దేశ విభజన అనంతరం ఏర్పడిన దేశం 'ఇస్లామిక్ ఇస్లామాబాద్' గా పేర్కొన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా... కౌరవులు స్టెమ్ సెల్ థెరపీతో పుట్టారని ఆ పుస్తకాల్లో పొందుపరచడం దారుణం. ఈ వరుసలోనే మోటార్ కారు వేద కాలంనాడే ప్రాచుర్యంలో ఉందని పేర్కొన్నారు. ఆ కారును అప్పట్లో అనాశ్వరథ్ అని పిలిచేవారట. అంటే గుర్రాలు లేని వాహనం అని అర్థం. చివరిగా... భారతదేశానికి ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చిన మహాత్మాగాంధీ అక్టోబర్ 30, 1948లో హత్యకు గురయ్యాడని రాశారు. వాస్తవానికి గాంధీ చనిపోయింది 1948 జనవరి 30న. అక్కడి ఉన్నత పాఠశాల విద్యార్థులకు సరఫరా చేసిన సప్లిమెంటరీ పుస్తకాల్లో ఇంకా ఎన్నో తప్పులున్నాయి. వీటిపై గుజరాత్ విద్యా శాఖ మంత్రి భూపేంద్ సింహ్ చుడాసమా వివరణ ఇస్తూ... ఈ పుస్తకాలు కేవలం రిఫరెన్స్ కోసమేనని, భారతీయ సంస్కృతిని విద్యార్థులకు పరిచయం చేసేందుకు ఉద్దేశించినవని తెలిపారు. ఇవి సిలబస్ లో భాగం కాదని పేర్కొన్నారు.