: వరసకు అన్న... కానీ కామాంధుడు!
‘కామాతురాణాం నభయం, నలజ్జ’ అన్నట్టు వాడి కామదాహానికి అంతు లేకుండా పోయింది. శ్రీకాకుళంలో రచ్చబండ రగడ పోలీస్ స్టేషనుకి చేరింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్నయ్యపేటకు చెందిన మజ్జి రమణ వరుసకు సోదరి అయిన వివాహితను కోరిక తీర్చాలంటూ వెంటపడేవాడు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఫోనులో అసభ్యంగా మాట్లాడుతూ వేధించసాగాడు. దీంతో ఆమె ఫోన్ కట్ చేసేది. అయినా అతను వేధింపులు మానకపోవడంతో... అతని మాటలను రికార్డు చేసి పెట్టింది. ఈ క్రమంలో గ్రామంలోని అప్పర్ ప్రైమరీ పాఠశాల వద్ద బోరు వద్దకు రాత్రి 8 గంటల ప్రాంతంలో స్నానానికి వెళ్లింది. అక్కడ కాపుకాసిన రమణ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో సమీపంలో పొలానికి వెళ్లిన బాబాయి వరస అయ్యే పొట్నూరు లక్ష్మణ చేరుకుని రమణను పట్టుకుని రచ్చబండ వద్దకు తీసుకొచ్చి నిలదీశాడు. దీంతో ఆమె వర్గీయులు, రమణ వర్గీయులు పోగయ్యారు. పరస్పర విమర్శలతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో రమణకు రాజకీయ పలుకుబడి ఉందని... అతని నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇంతలో తనను కొట్టి గాయపరిచారంటూ రమణ ఆమె, ఆమె తరపు బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిని శ్రీకాకుళం రిమ్స్ లో జాయిన్ చేసి కేసు నమోదు చేశారు.