: బీజేపీని ఓడించడానికి ఏకమైన బద్ధ శత్రువులు


నిన్నటివరకు ఉప్పు నిప్పుల్లా, బద్ధ శత్రువులుగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ), నితీష్ కుమార్(జేడీయూ)లు చేతులు కలిపారు. త్వరలో జరగనున్న బీహార్ శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి వీరివురూ మిత్రులుగా మారిపోయారు. తమతో పాటు కాంగ్రెస్‌ పార్టీని కూడా కలుపుకుని మరీ... బిజెపితో పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే బీహార్‌లో ఉపఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాల సీట్ల సర్దుబాట్ల విషయంలో ఆర్‌జేడీ, జేడీయు, కాంగ్రెస్‌ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. వచ్చేనెల 21వ తేదీన 10 బీహార్ శాసనసభా స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతాయి. బీహార్ లో బీజేపీని తుడిచిపెట్టేందుకే తమ పార్టీల మధ్య ఉన్న విభేదాలను వదిలిపెట్టి... మహాకూటమిగా ఏర్పడ్డామని ఇరుపార్టీల నేతలు అంటున్నారు. ఉపఎన్నికల్లో జేడీయు, ఆర్జేడీ చెరో నాలుగు స్థానాల్లోనూ, మిగిలిన రెండు సీట్లలో కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట్ నారాయణ్‌ సింగ్‌ తెలిపారు. నితీశ్‌కుమార్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. తమ ఈ కూటమి ఎన్నికల్లో సత్ఫలితాలు సాధిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ పది అసెంబ్లీ సీట్లలో బీజేపీకి ఆరు, ఆర్జేడీకి మూడు, జేడీయూకు ఒక స్థానం ఉన్నాయి. సుమారు 24 ఏళ్ల తర్వాత ఎన్నికలు ప్రచారంలో భాగంగా లాలూ, నితీష్ లిద్దరూ ఒకే స్టేజ్ పంచుకోనుండడంతో ఈ ఎన్నికలపై అందరి దృష్టిపడింది. 70లలో జనతా పార్టీలో లాలూ, నితీష్ లు రైజింగ్ యూత్ లీడర్లుగా ఉండేవారు. ఆ తర్వాత కాలక్రమంలో వీరివురూ సొంతపార్టీలు పెట్టుకుని బీహార్ రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా ఒకరినొకరు ఢీకొన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు బీజేపీని ఓడించడానికి వీరిద్దరూ ఏకమయ్యారు.

  • Loading...

More Telugu News