: భారతీయుల చేతుల్లోనే ఐఫోన్ తయారీ!
అదేంటీ, ఐఫోన్ ను తయారు చేస్తోంది యాపిల్ కంపెనీ అనేగా మీ సందేహం? మీరనుకుంటున్నది ఎంత నిజమో, ఈ వార్త కూడా అంతే నిజం! అదెలా అంటే, ఐఫోన్ తయారు చేస్తున్నది యాపిల్ కంపెనీనే అయినా, అందులో పనిచేసే ఇంజినీరింగ్ విభాగంలోని సిబ్బందిలో మూడో వంతు భారతీయులేనట. మరి ఐఫోన్ ను రూపొందిస్తున్న అంతమంది సిబ్బందిలో సింహభాగం భారతీయులే అయినప్పుడు, దానిని మనం తయారు చేస్తున్నట్లే కదా? అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. 2012లో యాపిల్, తన సిబ్బంది గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం సంస్థలో మొత్తం 47 వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో 7,700 మంది వినియోగదారులు సేవల విభాగంలో పనిచేస్తున్నారు. 27,350 మంది యాపిల్ రిటైల్ స్టోర్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన 12,000 మందిలో ఇంజినీర్లు, డిజైనర్లు, మార్కెటింగ్, ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగులున్నారు. ఈ కేటగిరీలను పరిశీలిస్తే, ఇంజినీరింగ్ విభాగంలో భారతీయుల సంఖ్య, మూడో వంతు ఉందని హెచ్ఎఫ్ఎస్ రీసర్చ్ అనే సంస్థ వెల్లడించింది. యాపిల్ సంస్థ జారీ చేస్తున్న హెచ్1బీ వీసాల్లో భారతీయులకు జారీ చేసినవే ఎక్కువట. 2001 నుంచి 2010 దాకా 1,750 హెచ్1బీ వీసాలను భారతీయులకు జారీ చేసిన యాపిల్, 2011-13 వచ్చేసరికి ఈ సంఖ్యను 2,800కు పెంచింది. యాపిల్ లో పనిచేసే ఇంజినీరింగ్ నిపుణుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయుడే ఉన్నారని హెచ్ఎఫ్ఎస్ తెలిపింది. హెచ్1బీ వీసాలతో వెళ్లిన వారే కాకుండా అమెరికా గ్రీన్ కార్డులున్న వారూ పనిచేస్తున్నారు. అంతేకాదండోయ్, యాపిల్ కు ఐటీ ఆధారిత సేవలను ఔట్ సోర్సింగ్ ద్వారా అందిస్తున్న సంస్థలు కూడా భారత్ వేనట. సదరు సంస్థల పేర్లు వెల్లడి కానప్పటికీ, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలేనని హెచ్ఎఫ్ఎస్ రీసర్చ్ తెలిపింది. అయితే యాపిల్ కు ఐటీ సేవలను అందిస్తున్న సాఫ్ట్ వేర్ సంస్థ, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలలో ఏదో ఒకటేనని తేలిపోతోంది. అయితే ఒక్క ఐఫోన్ ఏమిటి, యాపిల్ ఉత్పత్తులన్నింటి తయారీలో మనదే కీలక భూమిక. సో, ప్రౌడ్ టు బీ యాన్ ఇండియన్.