: రాజ్యాంగంలో ప్రతిపక్ష నేత గురించి లేదు... అయినా ఆ పదవి అవసరం: మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ


లోక్ సభలో ప్రతిపక్ష హోదాను అందుకునేందుకు ఏ పార్టీకీ తగినంత బలం లేని సంగతి తెలిసిందే. ఓ వైపు పతిపక్ష హోదా తమకు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈ క్రమంలో ప్రస్తుత సభలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై దేశ వ్యాప్తంగా డిబేట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో, లోక్ సభ స్పీకర్ గా విమర్శకుల నుంచి సైతం అభినందనలు అందుకున్న రాజకీయ కోవిదుడు, లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ తన మనసులోని మాటను వెల్లడించారు. "ప్రతిపక్ష నేత గురించి రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనకపోయినప్పటికీ... ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠపరిచేందుకు ఆ పదవిని సృష్టించారు. సభలో 10 శాతం సీట్లు సంపాదించిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే సాంప్రదాయం కొనసాగుతున్నప్పటికీ... స్పష్టమైన నిబంధనలు లేనందున ఎవరో ఒకరిని ప్రతిపక్ష నేతగా నియమించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే ప్రతిపక్షం కచ్చితంగా ఉండాలి. ప్రతిపక్ష నేత నియామకాన్ని స్పీకర్ విచక్షణకు వదిలేయాలి. ఈ విషయంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా" అంటూ ప్రతిపక్ష నేత ఆవశ్యకతను సోమ్ నాథ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News