: ఆంధ్రా క్రికెటర్లను హైలెవల్ కు తీసుకెళతా: ఎంపీ గంగరాజు
ఆంధ్రప్రదేశ్ క్రికెటర్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళేందుకు కృషిచేస్తానంటున్నారు ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) కార్యదర్శి, ఎంపీ గోకరాజు గంగరాజు. విజయవాడలో ఆదివారం ఆయనను 13 జిల్లాల క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రా క్రికెట్ సంఘాన్ని దేశంలోనే ఆదర్శ క్రికెట్ సంఘంగా మలుస్తానని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రా క్రికెటర్లకు ఎంఎస్కే ప్రసాద్ వంటి ఇంటర్నేషనల్ ప్లేయర్లతో శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. కాగా, ఏసీఏ డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని గంగరాజు పేర్కొన్నారు. వచ్చే నెల రెండోవారంలో విశాఖలో జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడిని ఆహ్వానించినట్టు తెలిపారు. ఇక, ఈ వేడుకల్లో ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ తో పాటు వీవీఎస్ లక్ష్మణ్, కుంబ్లే, శ్రీనాథ్ వంటి మాజీ క్రికెటర్లు కూడా పాల్గొంటారని గంగరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా మాజీ క్రికెటర్లకు రూ.2 కోట్ల 20 లక్షల రూపాయలను బహుమతిగా పంచుతామని వెల్లడించారు.