: మోడీ వీసా వివాదం ఇక ముగిసినట్లే: అమెరికా ఉన్నతాధికారి
నరేంద్రమోడీ అమెరికా వీసా వివాదం ముగిసిన అధ్యాయమని అమెరికా విదేశాంగ శాఖ వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ (దక్షిణ, మధ్య ఆసియా) నిషాదేశాయ్ బిస్వాల్ వ్యాఖ్యానించారు. నరేంద్రమోడీని ఒబామా అమెరికాకు ఆహ్వానించిన తర్వాత... ఆయనకు వీసా జారీ చేయాల్సి ఉంటుందన్న విషయం ఒబామాకు తెలిసే ఉంటుంది కదా? అని ఆమె వ్యాఖ్యానించారు. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడే మోడీని ఆహ్వానించడంతో ఇకపై ఈ విషయంలో ఎలాంటి వివాదానికి తావులేదని ఆమె వ్యాఖ్యానించారు. సెప్టెంబర్లో నరేంద్రమోడీ అమెరికా పర్యటన కోసం తామంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆమె అన్నారు. నరేంద్రమోడీ పర్యటన ద్వారా ఇండియాతో అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయాలని తాము కోరుకుంటున్నామని ఆమె తెలిపారు.