: నేటి నుంచే భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు
విదేశీగడ్డపై దూసుకుపోతున్న టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. సౌతాంప్టన్ లోని ఏజియస్ బౌల్ స్టేడియంలో ఈ రోజు భారత్, ఇంగ్లండ్ ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు టెస్టులు జరగ్గా... 1-0 ఆధిక్యంతో భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. దీంతో, ఈ మ్యాచ్ ను గెలిచి ఐదు టెస్టుల సిరీస్ లో పట్టు బిగించాలని భారత్ కృత నిశ్చయంతో ఉంది. మరో వైపు సొంతగడ్డపై మెరుగైన ప్రదర్శన చేయలేక ఇంగ్లండ్ జట్టు డీలా పడింది. అయితే, ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్ చేజారకుండా ప్రణాళికలు రచిస్తోంది. జట్టు కూర్పు విషయానికి వస్తే... భారత్ ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ తో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టూవర్ట్ బిన్నీ స్థానంలో రోహిత్ శర్మ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచిన ఓపెనర్ ధావన్ కు మరో అవకాశం దక్కవచ్చు. ఇంగ్లండ్ విషయానికొస్తే... కెప్టెన్ కుక్, కీలక బ్యాట్స్ మెన్ బెల్ ఘోరంగా విఫలమవుతున్నారు. అనుభవం లేని ఆటగాళ్లు మొయిన్ అలీ, బ్యాలెన్స్ లే జట్టుకు ప్రధాన బ్యాట్స్ మెన్లుగా మారారు. పసలేని కుక్ కెప్టెన్సీ కూడా ఇంగ్లండ్ విజయావకాశాలను దెబ్బతీస్తోంది. పిచ్ విషయానికి వస్తే... చక్కటి బౌన్స్ ఉంటుంది. చివర్లో స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. స్టార్ స్పోర్ట్-1లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.