: సుపరిపాలన కోసం 'మైగవ్' వెబ్ పోర్టల్ ను ప్రారంభించిన మోడీ
సుపరిపాలన దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వడివడిగా అడుగులు ముందుకువేస్తున్నారు. పాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించేందుకు నరేంద్రమోడీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజలు తమ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను ప్రభుత్వంతో పంచుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడి శనివారం ‘మైగవ్' (Mygov.nic.in)అనే వెబ్ సైట్‌ను ప్రారంభించారు. గంగానది ప్రక్షాళన దగ్గరనుంచి మనదేశ యువతలో వృత్తి నైపుణ్యాలు పెంచడం వరకు... ఇలా ప్రతీ అంశం మీద ప్రజలు తమ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు ప్రభుత్వానికి ఈ వెబ్ సైట్ ద్వారా తెలియజేయవచ్చు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి శనివారానికి 60 రోజులు పూర్తయిన సందర్భంగా నరేంద్రమోడీ ఈ వైబ్ సైట్ ను ప్రారంభించారు. చాలామంది ప్రజలు జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నారని, దేశం కోసం తమ శక్తిని, శ్రమను ధారపోయడానికి సిద్ధంగా ఉన్నారని...ఈ 60 రోజులో తనకు అనుభవమయిందని మోడీ ఈ సందర్భంగా అన్నారు. అలాంటి వారి కోసమే 'మై గవ్' పోర్టల్ ను ప్రారంభించామని మోడీ చెప్పారు. ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదని....ప్రజలకు, ప్రభుత్వానికి ఉన్న అగాధాన్ని ఈ వేదిక పూడ్చివేయగలదని మోడీ అభిప్రాయపడ్డారు.