: తాను మరణించి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి!
ఇజ్రాయెల్ దాడులతో గాజా పట్టణం శిథిలంగా మారుతోంది. క్షిపణి దాడులతో పాలస్తీనా రాజధాని గాజాను ఇజ్రాయెల్ వణికిస్తోంది. దాడులకు 12 గంటలు విరామం ప్రకటించడంతో క్షిపణి, బాంబు దాడులకు అసువులు బాసిన సుమారు 85 మంది పాలస్తీనీయుల మృతదేహాలను కూలిన శిధిలాల నుంచి వెలికితీశారు. శిధిలాల తొలగింపు ప్రక్రియ యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరగే అవకాశం ఉందని గాజా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ దళాలకు, పాలస్తీనాలోని హమాస్ వర్గానికి మధ్య జరుగుతున్న పోరులో దాదాపు 1000కి పైగా సాధారణ పౌరులు మృతి చెందారు. గాజా పట్టణంలో ఎటూ చూసినా శిధిలమైపోయిన ఇళ్లు, శిధిలాల్లో చిక్కుకుని మృతి చెందిన సాధారణ పౌరులు. దీంతో స్థానికులు బాధాతప్త హృదయాలతో బంధువుల మృతదేహాల వద్ద రోదిస్తున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 23 ఏళ్ల గర్భిణి ప్రాణం విడిచింది. శిథిలాల కింద పడిఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె శవానికి శస్త్ర చికిత్స చేసి గర్భంలో ఉన్న శిశువును కాపాడారు. ఈ ఘటన వైద్యులు సహా చూపరుల హృదయాలను బరువెక్కించి, కళ్లను చెమర్చింది.