: హైదరాబాదు మెట్రో రైలు స్టేషన్ వద్ద ఇనుప రాడ్డు తగిలి... తల పగిలింది
హైదరాబాదు నగరంలోని ఉప్పల్ లో నిర్మాణంలో ఉన్న మైట్రో రైలు స్టేషన్ వద్ద ప్రమాదం జరిగింది. ఇనుప పైప్ ఒకటి... అటుగా వెళుతున్న వాహనదారుని తలకు తగలడంతో... ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... వనస్థలిపురం వాసి ఈశ్వర్ ప్రసాద్ (48) చర్లపల్లిలోని ఓ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం ఉదయం ఉప్పల్ మీదుగా చర్లపల్లిలోని కంపెనీకి వెళుతున్నాడు. ఉప్పల్ లోని సర్వే ఆఫ్ ఇండియా సమీపంలోని మెట్రో రైలు స్టేషన్ వద్ద పనులు జరుగుతున్నాయి. మెట్రో రైలు స్టేషన్ వద్ద కార్మికులు 15 మీటర్ల పొడవైన ఇనుప పైపును రోడ్డు దాటిస్తుండగా... అదే సమయంలో అటుగా వెళ్తున్న ఈశ్వర్ ప్రసాద్ ఇనుప పైప్ ను ఢీకొన్నాడు. అతని తలకు బలమైన గాయం కావడంతో... 108 ద్వారా క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తును చేపట్టారు. ఇదిలా ఉండగా... ఈ ఘటనపై స్థానికులు మరో వాదనను వినిపిస్తున్నారు. స్టేషన్ వద్ద పనులు జరుగుతున్నాయని, పైప్ పై నుంచి పడటంతో ఈశ్వర్ ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు.