: అందరి కళ్ళూ అతడిపైనే... రేపటి నుంచి మూడో టెస్టు
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రేపు మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కు సౌతాంప్టన్ వేదిక. భారత జట్టులో మార్పులు దాదాపుగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. 'లార్డ్స్' టెస్టులో ఆడిన జట్టునే బరిలో దింపాలని టీమిండియా వ్యూహకర్తలు భావిస్తున్నారు. కాగా, లార్డ్స్ పిచ్ పై నిప్పులు చెరిగిన ఇషాంత్ శర్మ సౌతాంప్టన్ లో ప్రధానకర్షణగా నిలవనున్నాడు. ఏడు వికెట్లతో ఇంగ్లండ్ కు కడగండ్లు మిగిల్చిన ఈ పొడగరి బౌలర్ పైనే అందరి కళ్ళూ ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. మూడో టెస్టుకు తయారుచేసిన పిచ్ బౌలర్లకు సహకరిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఇషాంత్ రెచ్చిపోతే ఆతిథ్య జట్టు కష్టాలు రెట్టింపవుతాయి. మరోవైపు భువనేశ్వర్ కుమార్ పదునైన స్వింగర్లతో ఇంగ్లిష్ ఓపెనర్లకు పరీక్ష పెడుతున్నాడు. ముఖ్యంగా కెప్టెన్ కుక్ ఈ యువ బౌలర్ బంతులకు తడబాటుకు గురవుతున్నాడు. ఇషాంత్, భువీకి తోడు షమీ కూడా లయ దొరకబుచ్చుకుంటే మ్యాచ్ మూడ్రోజుల్లో ముగిసినా ఆశ్చర్యపోనవసరంలేదు.