: శివరామకృష్ణన్ కమిటీ అడిగితే చెప్పా...తప్పుదోవ పట్టించాలని కాదు: నారాయణ
కర్నూలులో ఐఐఐటీ, అనంతపూర్లో ఏన్ఐటీ, తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, గుంటూరులో ఎయిమ్స్, ఆరోగ్య విశ్వవిద్యాలయం, విశాఖలో గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ... ఇలా వివిధ నగరాలను అభివృద్ధికి ప్రాతిపదికగా ఎంపిక చేసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాము గుంటూరు, విజయవాడ రాజధాని అంటూ తప్పుదోవ పట్టించడం లేదని, శివరామకృష్ణన్ కమిటీ అడిగిన సూచన మేరకు గుంటూరు- విజయవాడ రాజధాని అయితే బాగుంటుందని సూచించామని అన్నారు. రాష్ట్రప్రభుత్వం అభిప్రాయం చెప్పాల్సి ఉందని, ఆ మేరకే రాజధానిగా విజయవాడ, మంగళగిరి, గుంటూరు ప్రాంతాన్ని సూచించామని ఆయన తెలిపారు. అన్ని రకాల కార్యాలయాల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు అనుకూలంగా ఉంటుందని ఆయన వివరించారు. రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ టెండర్లను పిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాదని ఆయన స్పష్టం చేశారు. తమ ముందున్నది కేవలం రాజధాని నిర్మాణమే కాదని, రాష్ట్రాన్ని కొత్తగా, సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా తమపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.