: మూడు ప్రధాన నగరాల కోసం 14 ప్రాంతాలను గుర్తించాం: శివరామకృష్ణన్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి, ప్రధాన పట్టణాల నిర్మాణానికి అనువైన 14 ప్రాంతాలను గుర్తించామని శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ... ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల రాజధానుల ఏర్పాటు వారు కోరుకునే విధంగా జరిగిందని, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంగతి వేరని ఆయన స్పష్టం చేశారు. విశాఖ, తిరుపతి, విజయవాడ వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలను గుర్తించామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు ఉద్యోగాలు కల్పించరని, ఉద్యోగాల కల్పనకు అవకాశాలు కల్పిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కాంక్షిస్తున్నారని అన్నారు. బ్రెజిల్ లాంటి వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే 'పుత్రజయ' లాంటి సాంకేతిక అంశాలు ఉన్నాయని ఆయన అన్నారు. విశాఖ, రాజధాని, అనంతపురం ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధి చెందే ప్రణాళికలు రచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కోస్టల్ కారిడార్, విమానాశ్రయం, రైల్వే లైన్, పోర్టులు ఇలా అన్నీ వసతులు రాష్ట్రవ్యాప్తంగా సమకూరాలని చంద్రబాబు కాంక్షిస్తున్నారని ఆయన తెలిపారు. రాయలసీమలో నీటి సౌకర్యాల కల్పన పెద్ద సవాలని ఆయన పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రాయలసీమ, ఉత్తరకోస్తా ప్రాంతాలు 'అనువు కాదని' ఆయన రాజధానిపై సంకేతాలిచ్చారు. ప్రస్తుతానికి రాజధాని నిర్మాణానికి 13, 14 ప్రాంతాలు గుర్తించామని అన్నారు. ప్రముఖ విద్యాసంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రాలో ఏ మూలకెళ్లినా భూమి రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖ బాగా అభివృద్ధి చెందింది కనుక ఇంకో నగరం రాజధాని కావాలని రాయలసీమ, కోస్తాంధ్రులు కోరుతుండగా... ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం కనుక విశాఖనే రాజధాని చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మూడు లేదా నాలుగు నగరాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన సూచించారు. కేంద్రం అందుకు తగ్గ ప్రణాళికలు రచిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ప్రణాళికకు అనుగుణంగా ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని ఆయన తెలిపారు. గుంటూరు- విజయవాడ ప్రాంతం అభివృద్ధి చెందితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం చేస్తే సమస్యలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. 193 ప్రధాన కార్యాలయాలు రాజధానిలో కొలువుతీరాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అభివృద్ధి జరగాలంటే పలు నగరాలను విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.