: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇలా ఉండబోతుంది
ఆంధ్రప్రదేశ్ రాజధాని స్మార్ట్ గా పూర్తి సౌకర్యాలతో నిర్మిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి అనుకూల ప్రాంతాన్ని సూచించేందుకు శివరామకృష్ణన్ కమిటీ విస్తృత పరిశోధన జరుపుతోందని అన్నారు. రాజధాని ఎలా నిర్మిస్తే బాగుంటుందనే దానిపై బ్రెజిల్ రాజధానిని, ఆస్ట్రేలియా లోని కాన్ బెర్రా, పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్, మలేసియాలోని పుత్రజయ, సింగపూర్ రాజధాని, చైనాలోని షాంగై నగరాలను శివరామకృష్ణన్ కమిటీ పరిశీలించనుందని ఆయన తెలిపారు. అలాగే భారతదేశంలోని రాయ్ పూర్, చంఢీగఢ్, గాంధీ నగర్, భువనేశ్వర్, కటక్ నగరాలను పరిశీలించనున్నట్టు ఆయన తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసేటప్పుడు నీరు, విద్యుత్, భూమి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ ఇంకా ఐదు జిల్లాలను పరిశీలించాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈరోజు పోర్టులు, పారిశ్రామిక కారిడార్ లపై ప్రధానంగా చర్చ జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాలమైన, సర్వహంగులతో రాజధానిని నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.