: రూ.90 కోట్లు పలికిన రాజేశ్ ఖన్నా ఇల్లు!
బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాకు చెందిన ఇల్లు రూ.90 కోట్లకు అమ్ముడుపోయింది! నమ్మశక్యంగా లేకున్నా, ఇది ముమ్మాటికీ నిజమంటోంది మీడియా. ముంబైలోని ఈ ఇంటిని ఓ పారిశ్రామిక వేత్త ఇంత ఖరీదు పెట్టి కొనుగోలు చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబైలోని కార్టర్ రోడ్ లో సముద్ర తీరానికి అభిముఖంగా ‘ఆశీర్వాద్’ పేరిట ఖన్నా అభిమానేలనే కాక పర్యాటక ప్రియులను కూడా విశేషంగా ఆకట్టుకుంటున్న 603 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఉన్న ఈ భవనాన్ని ఆల్ కార్గో లాజిస్టిక్స్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శశి కిరణ్ షెట్టి కొనుగోలు చేశారట. అయితే ఆయనను సంప్రదిస్తే, 'నో కామెంట్' అంటూ వెళ్లిపోయారు. 'ఆశీర్వాద్' ను ఆయనకు దక్కేలా చేసిన బ్రోకరేజీ సంస్థ కూడా దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. ప్రస్తుతం రాజేశ్ ఖన్నా వారసులు ఆయన ఇద్దరు కుమార్తెలు ట్వింకిల్, రింకీలే. ఇంటిని అమ్మగా వచ్చిన మొత్తం రూ.90 కోట్లు కూడా వారికే దక్కనున్నాయి. ఇదిలా ఉంటే ఖన్నా ఇంటిని కొన్న షెట్టి, సదరు ఆస్తిపై అభ్యంతరాలుంటే తెలపాలంటూ పత్రికా ప్రకటనలు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ తతంగం కూడా ముగిసిన తర్వాత కొనుగోలు విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.