: ’నల్లధనం‘ రాక సాధ్యమేనా..?
మన రాజకీయ నేతలతో పాటు బడా పారిశ్రామిక వేత్తలు అక్రమంగా సంపాదించిన సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా దేశ సరిహద్దులు దాటించేస్తున్నారు. ఆ తర్వాత స్విస్ బ్యాంకుల్లో భద్రంగా దాచుకుంటున్నారు. అటుపైన అవసరమైనప్పుడల్లా ఎంచక్కా తెచ్చేసుకుని పనులు చక్కబెట్టుకుంటున్నారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలునే విసురుతున్నారు. అవినీతిపై రాజీలేని పోరు సాగిస్తామని ముందు నుంచీ చెబుతూ వస్తున్న ప్రధాని మోడీ, విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తీసుకురాగలరా? అన్న ప్రశ్న తాజాగా తెరపైకి వచ్చింది. అవును మరి, ఎప్పటినుంచో చేస్తున్న యత్నాలకు ఎప్పటికప్పుడు ఆటంకాలు ఎదురవుతూనే ఉంటే, మోడీ ఎలా తేగలరు? అన్న ప్రశ్న మదిలో మెదలక తప్పదు మరి. అలా ఆ ప్రశ్న తన మెదడును తొలచడంతో కాస్తంత లోతుగా పరిశీలన చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే, కాస్త కటువుగానైనా వాస్తవమే చెప్పారనిపిస్తుంది. జార్ఖండ్ లోని గొద్దా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దూబే, గురువారం లోక్ సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు మన జీవిత కాలంలోనే నల్లధనాన్ని వెనక్కు తీసుకురాలేమని ఆయన కుండ బద్దలుకొట్టారు. దీంతో నల్లధనంపై తమ పార్టీ వ్యవహరిస్తున్నది మేకపోతు గాంభీర్యమేనని ఆయన చెప్పకనే చెప్పారు. అసలు దూబే, ఆ వ్యాఖ్యలు ఎలా చేశారంటే, స్విస్ బ్యాంకులో మూలుగుతున్న నల్లధనంపై లోతుగా పరిశీలన చేసిన తర్వాతే చెబుతున్నానని, కావాలంటే ఆ వివరాలు చెబుతాను చూడండంటూ సూటిగానే బదులిచ్చారు. "డబ్బు దాచాలనుకున్న వ్యక్తులు ట్రస్టీలుగా ఏర్పడ్డారు. ఆ ట్రస్టీలు, ఉద్యోగుల హోదాలో ఉన్న స్విట్జర్లాండ్ పౌరుల ఆధీనంలో ఉన్నాయి. నల్లధనం దాచుకున్న భారతీయుల పేర్లను వెల్లడించమని మనం స్విస్ బ్యాంకును సంప్రదిస్తే, జాబితాను పొందడం అంత కష్టమైన పనేమీ కాదు. అయితే ట్రస్టీల పేర్లు తెలిస్తేనే కదా ఎంత మొత్తం దాచారన్న విషయం తేలేది? మరి, ట్రస్టీల పేర్ల వెల్లడి సాధ్యమేనా? కాదు కదా! ట్రస్టీల పేర్లు తెలియకుండా డబ్బెలా తెస్తాం?"అంటూ దూబే ఎదురు ప్రశ్న సంధించారు. దీంతో సొంత పార్టీ బీజేపీనే తెల్లబోవాల్సి వచ్చింది. నిజమే మరి, ట్రస్టీల పేరిట డబ్బు దాస్తే, ట్రస్టీలు, అందులోని వ్యక్తుల పేర్లు వెల్లడి కావాలి కాని, కేవలం వ్యక్తుల జాబితా వెల్లడి వల్ల ప్రయోజనమేంటి? అసలు ఆయా వ్యక్తులు ఎంత డబ్బు దాచారన్న విషయం తేలేదెలా?. అందుకే జీవిత కాలంలో మన నేతలు దాచిన నల్లధనాన్ని వెనక్కి తేలేమని దూబే చెప్పేశారు. మరి ప్రధాని మోడీ ఏమంటారో చూడాలి.