: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేస్తోంది!


రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ రెండు రాష్ట్రాల్లోనూ పూర్తిగా నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్ కు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నప్పటికీ, పాలనపరమైన ఇబ్బందుల వల్ల ఈ పరిస్థితి దాపురించగా, ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు కమిషన్ లేని కారణంగా తెలంగాణలో సమస్య ఉత్పన్నమైంది. ఏపీ పరిస్థితి ఎలా ఉన్నా, ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు తెలంగాణ సర్కారు ముమ్మర యత్నాలు చేస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు ఆ రాష్ట్రం రంగం సిద్ధం చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, మరో పది రోజుల్లో కమిషన్ కొలువుదీరనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైలును సిద్ధం చేసిన సర్కారు, రెండు మూడు రోజుల్లో గవర్నర్ అనుమతి కోసం పంపే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గవర్నర్ అనుమతి తర్వాత కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం పది రోజుల సమయం పడుతుంది. కమిషన్ కు ఓ ఛైర్మన్ ను తప్పనిసరిగా నియమించాల్సి ఉంది. అయితే కమిషన్ లో ఎంత మంది సభ్యులుండాలన్న అంశంపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. నలుగురు లేదా ఐదుగురు సభ్యులను నియమించి, అవసరమనుకుంటే, ఆ తర్వాత సభ్యుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే కమిషన్ ను మాత్రం ఏర్పాటు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారట. ఉమ్మడి రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో టీపీఎస్సీ ఏర్పాటు ప్రస్తావన ఉన్న నేపథ్యంలో గవర్నర్ ఆమోదానికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని భావిస్తున్నారు. ఛైర్మన్, సభ్యుల నియామకంతో పాటు కమిషన్ లో పనిచేసేందుకు ఎంత మంది సిబ్బంది కావాలన్న అంశంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. అయితే ఈ ప్రక్రియలన్నీ ముగిసి కమిషన్ ఏర్పాటు ఆగస్టు తొలివారంలోగా పూర్తి కావడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో అదే నెలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణ పర్యాటక సంస్థ ఏర్పాటుకు అనుమతి: ఇదిలా ఉంటే తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కంపెనీల చట్టం-2013 కింద సంస్థను రిజిస్టర్ చేయడానికి అనుమతిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పర్యాటక అభివృద్ధి సంస్థకు కూడా సిబ్బంది, డైరెక్టర్లతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం సిబ్బంది, అధికారుల జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమైంది. టీఎస్టీడీసీ ఏర్పాటు పూర్తైతే, తెలంగాణలో పలు పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News